వరంగల్ జిల్లా : వరంగల్ చరిత్రకు సరికొత్త భాష్యం‌ చెప్పి, కాకతీయుల కళా ప్రాభవాన్ని, సాంస్కృతిక వికాసాన్ని తనదైన శైలిలో ప్రపంచానికి తెలియచేసిన ఓరుగల్లు చరిత్ర పరిశోధకులు, సాహితీవేత్త ఆచార్య హరిశివకుమార్ శనివారం వరంగల్ లోని కృష్ణాకాలనీలో ఆయన స్వగృహంలో మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివకుమార్ మృతి వరంగల్ జిల్లా సాహిత్య లోకానికి తీరని లోటు. 19-04-1942లో జన్మించిన శివకుమార్ డిగ్రీ వరకు వరంగల్ లో చదివి పిజి తెలుగు హైదరాబాద్ లో చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి కేతన రచనలపై పరిశోధనకు పిహెచ్డి పట్టా అందుకున్న శివకుమార్ కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకుడుగా పనిచేశారు. తెలుగు శాఖాధిపతిగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గా పలు బాధ్యతలు నిర్వర్తించారు. హరి శివకుమార్ వద్ద 13 మంది ఎంఫిల్, 7 గురు పిహెచ్డి చేసారు. వీరి తండ్రి హరిరాధాకృష్ణమూర్తి, భద్రకాళి దేవాలయ పునరుద్ధరణలో కీలక భూమిక పోషించారు. చిన్ననాటి నుంచే భద్రకాళి అమ్మవారిపై భక్తితో పాటు వరంగల్ చరిత్రపై ఆసక్తి కలిగిన శివకుమార్ ఆ తర్వాత కాకతీయులకు సంబంధిన మరుగున పడిన చరిత్రను వెలుగులోకి తెచ్చారు. వేయిస్థంభాల దేవాలయం, రామప్ప ఆలయాల శతాబ్ధి ఉత్సవాల ప్రాధాన్యాన్ని ప్రపంచానికి తెలియచేసిన మహోన్నత చరిత్ర శొధకులు ఆయన. గద్వాల సంస్థానము- సాహిత్యసేవ, వ్యాసలహరి వంటి గ్రంధాలు ఆయనలోని సాహిత్యకోణాన్ని ఆవిష్కరిస్తే, కాకతీయ వైభవం, వేయిస్థంభాల దేవాలయం చరిత్ర, శ్రీ భద్రకాళి దేవాలయం చరిత్ర, శ్రీ కాశీవిశ్వేశ్వర రంగనాథుల ఆలయాలు వంటివి ఆయనలోని చరిత్రకారుడిని ఆవిష్కరించాయి. ఆయనలోని సాహిత్యకారుడు మంత్ర శాస్త్ర అర్థ విశ్లేషకుడు కూడా. మహామృత్యుంజయ పాశుపత తంత్రం, శ్రీ దుర్గా తంత్రమ్, శ్రీ సర్పతంత్రం వంటి మంత్ర శాస్త్ర గ్రంధాలు ఇందుకు నిదర్శనం కాగా శివకుమార్ అనువాదకులు కూడా. కంచి పరమాచార్య భారతీతీర్థుల వారి ప్రబోధాత్మక సంభాషణలను ఆంగ్లం‌నుంచి తెలుగులోకి అనువాదం చేయగా.. మహాత్మా త్రైలింగ స్వామి జీవితము- ఉపదేశమ్ అనే గ్రంథాన్ని హిందీ నుంచి తెలుగులోకి అనువదించారు. సద్గురు కందుకూరి శివానందమూర్తికి శిష్యుడుగా ఆయనతో కలిసి చారిత్రక చర్చలు చేస్తూ భారతీయ చరిత్ర పై సునిశిత విశ్లేషణ చేసేవారు. 2013లో తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారాన్ని అందుకున్న హరిశివకుమార్ ఎన్నో సన్మానాలు, సత్కారాలు పొందారు . వరంగల్ అసలు చరిత్ర భావి తరాలకు తెలియాలన్న సంకల్పంతో 2016 లో ఓరుగల్లు అసలు చరిత్ర అనే పుస్తకం వ్రాశారు. మరణించేవరకు తన సాహితీవ్యాసంగాన్ని  కొనసాగించిన హరిశివకుమార్ మృతికి అక్షరాంజలి ఘటిస్తున్నాం.